భద్రాచలంలో కల్యాణ రాముడి పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అధికారులు సీతతో రాముని పట్టాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. గవర్నర్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
ముందుగా కలశాలు, ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడికి అష్టోత్తర శతనామార్చన చేశారు. పట్టాభిషేక కార్యక్రమాల్లో భాగంగా ఆలయ పూజారులు శ్రీరాముడికి పాదుకలు సమర్పించారు. రాజదండం, రాజ ముద్రిక, రాజ ఖడ్గం, ఛత్రం, చామరలు, రామదాసు పచ్చల పతకం ఇలా ఒక్కోటిగా శ్రీరాముడికి అలంకరించారు. తర్వాత వైభవంగా రామచంద్రునికి కిరీటధారణ చేశారు. చివరగా వివిధ నదుల తీర్థాలతో సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారికి అభిషేకం నిర్వహించారు.