తిరుమల, ఒంటిమిట్ట, ఏకశిలానగరంలో జగదభి రామయ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్‌బాబు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా చేశామని వారు తెలిపారు. కోదండ రామయ్య బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వారు తెలిపారు. కోయిల్ ఆళ్వార్ కార్యక్రమం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమాలను ఆద్యంతం భక్తి పరావశ్యంతో నిర్వహించబోతున్నామన్నారు. ఈ క్రతువు జరిగే సమయంలో గర్భాలయంలోకి భక్తుల ప్రవేశం నిలిపివేస్తామన్నారు. ఉదయం 11.20 గంటల నుండి రామయ్య దర్శనం కోసం భక్తులకు అనుమతి ఇస్తామని ఆ సమయంలోనే భక్తులు దర్శనం చేసుకోవాలని సూచించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. భక్తులు కూడా ఒకేసారి దర్శించుకోవాలనే ఆలోచనను పెట్టుకోవద్దని, ప్రతిరోజూ దర్శనాలు ఉంటాయని తెలిపారు. కాబట్టి టైమ్ రూల్స్ ను తెలుసుకుని రావాలన్నారు.