ఒంటిమిట్టలో సీతా రాముల కల్యాణం సందర్భంగా ఈరోజు ఉదయం 9 గంటల నుండి రేపు ఉదయం 10 గంటల వరకు కడప మీదుగా వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లించారు. కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు ఆలంఖాన్ గ్రామ సమీపంలోని ఇర్కాన్, ఊటుకూరు జంక్షన్ల మీదుగా రాయచోటి వెళ్లి అక్కడి నుంచి తిరుపతికి వెళ్లాలి. తిరుపతి నుంచి కడప వైపు వచ్చే వాహనాలు రాయచోటి మీదుగా రావాలి. రాజంపేట నుంచి కడపకు వచ్చే భారీ వాహనాలను రాయచోటి మీదుగా మళ్లించారు. సలాబాద్ నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలను ఇబ్రహీంపేట, మాధవరం మీదుగా మళ్లించారు.
ఇక ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం శుక్రవారం సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్య పండు వెన్నెలలో వైభవంగా జరగనుంది. సీతారాముల కల్యాణోత్సవానికి వైఎస్సార్ జిల్లా యంత్రాగం, టీటీడీ సర్వం సిద్ధం చేశాయి. భక్తులకు పంపిణీ చేయడానికి లక్ష ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను టీటీడీ సిద్ధం చేసింది. సీతారాముల కల్యాణాన్ని లక్ష మంది ప్రత్యక్షంగా వీక్షించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. సీఎం చంద్రబాబు కల్యాణోత్సవంలో పాల్గొననున్నారు. సీఎం సాయంత్రం 5 గంటలకు ఒంటిమిట్ట చేరుకుని, ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేస్తారు.