ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తారు. యుగాది అంటే ఒక యుగం మరియు కొత్తదానితో ముడిపడి ఉంది. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి. హిందూ చాంద్రమాన క్యాలెండర్ చైత్రమాసంలో మొదటి రోజు. ఈ సంవత్సరం ఉగాది మార్చి 30న ఆదివారం నాడు విశ్వవసు నామ సంవత్సర మొదలు కానుంది. ఈ పండుగను దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో ‘గుడిపాడ్వా’ పేరుతో పిలుస్తారు. తమిళులు “పుత్తాండు” అనే పేరుతో, మలయాళీలు “విషు” అనే పేరుతోను, సిక్కులు “వైశాఖీ” గానూ, బెంగాలీలు “పొయ్‌లా బైశాఖ్” గానూ జరుపుకుంటారు.
ప్రతిరోజు పంచాంగం అనబడే తిథి, వార, నక్షత్ర, యోగ, కరుణ విశేషాలని పరిశీలించినందువలన ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయని మన సనాతన ధర్మం చెబుతుంది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి మొదటి పండుగ. ఉగాది రోజున ఉదయాన్నే లేచి ఇళ్ళు, వాకిళ్లు శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి సాన్నం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. “ఉగాది పచ్చడి” ఈ పండుగకు ప్రత్యేకమైనది. షడ్రుచుల సమ్మేళనం తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.