విజయవాడలోని అశోక్‌నగర్‌లో త్రీవ విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే , కృష్ణా జిల్లా మచిలీపట్నం టెంపుల్ కాలనీకి చెందిన మహ్మద్ అబ్బాస్, క్రేన్ హెల్పర్‌గా పని చేస్తున్నారు. అతనికి విజయవాడ అశోక్ నగర్‌కు చెందిన మహిళతో నాలుగేళ్ల కిందట వివాహం అయింది. వీరికి అయేషా, ఆఫియా (18 నెలలు) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 19న అబ్బాస్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మచీలిపట్నం నుంచి అశోక్ నగర్‌లోని అత్తారింటికి వచ్చారు.
అదే రోజు చిన్నారి ఆఫియా, మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆడుకుంటూ స్నానాల గదిలోకి వెళ్లింది. అక్కడ స్నానాల గది శుభ్రం చేసే యాసిడ్ సీసా మూత తీసి, నీళ్లనుకుని తాగింది. దీంతో కడుపులో వికారంగా ఉండటంతో వాంతులు చేసుకుంది. గమనించిన తల్లి తండ్రులు, వెంటనే అప్రమత్తమై పాపను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆఫియా చికిత్స పొందుతూ ఈ నెల 21న మరణించింది. కూతురి మరణంతో వారి ఇంట్లో కన్నీటి సంద్రమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.