శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు గంజాయి రవాణాపై పోలీసుల నిఘా తప్పించుకోడానికి ఏకంగా అంబులెన్స్‌లో రవాణా చేస్తూ దొరికిపోయారు. అంబులెన్స్ టైరు పంక్చర్ కావడంతో అక్కడే ఉన్న యువకులు డ్రైవర్‌ను విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటన కొత్తగూడెంలోని రామవరంలో జరిగింది. హెచ్చరికలు ఉల్లంఘించి గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన అంబులెన్స్ డ్రైవర్ దొరికిపోయాడు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని రామవరం సమీపంలో శనివారం అర్థరాత్రి జరిగిన ఘటనలో రెండు కోట్ల రూపాయల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏజెన్సీ నుంచి కొనుగోలు చేసిన గంజాయిని తమిళనాడు కంపెనీ నంబర్‌తో కూడిన వాహనంలో కొత్తగూడెం మీదుగా తరలిస్తున్నారు. రామవరం శివారులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంబులెన్స్ పంక్చర్ కావడంతో ఆగిపోయింది. అర్థరాత్రి రోడ్డుపై అంబులెన్స్ ఆగడంతో, సాయం చేసేందుకు వచ్చిన స్థానిక యువకులకు డ్రైవర్ పొంతన లేని సమాధానాలు చెప్పాడు.
పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌ను విచారించారు. వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో 4 క్వింటాళ్ల గంజాయి ఉండడంతో షాక్‌కు గురయ్యారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు, తక్కువ నిఘా ఉన్న మార్గాల్లో సరుకును చెన్నైకి తరలిస్తున్నారని చెప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. యువకుల అప్రమత్తతతో గంజాయిని స్వాధీనం చేసుకున్న స్థానిక యువకులను పోలీసులు అభినందించారు.