అమెరికాలో ఈతకు వెళ్లి హైదరాబాదీ యువకుడు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం ఈ ఘటన జరగగా ఆదివారం యువకుడి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన గోపాల్ రెడ్డి, సమంత దంపతులు 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ లోని కాటేదాన్ కు వచ్చి స్థిరపడ్డారు. వీరి ఇద్దరు కూతుళ్లకు వివాహాలు కాగా కుమారుడు అక్షిత్ రెడ్డి(26)ని చదివించేందుకు మూడేళ్ల క్రితం అమెరికాకు పంపారు. షికాగోలో ఎంయస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.
మరోవైపు కొడుకు పెళ్లి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే గత శనివారం అక్షిత్ రెడ్డి తన ఇద్దరు స్నేహితులతో కలిసి మిషిగన్ సరస్సులో ఈతకు వెళ్లాడు. ఒకరు ఒడ్డున ఉండి, మరో ఇద్దరు నీటిలో దిగి చెరువు మధ్యలో ఉన్న రాయి వద్దకు వెళ్లారు. చాలా ప్రయత్నాల తర్వాత అక్కడికి చేరుకునే సమయానికి అక్షిత్ రెడ్డి అలసిపోయి నీట ముగిపోయాడు. అతని స్నేహితుడు కూడా నీటిలో మునిగిపోవడంతో స్థానికులు రక్షించారు. ఈ మేరకు పోలీసులు అక్షిత్ రెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన మృతదేహానికి ఆదివారం అడ్డాకులలో అంత్యక్రియలు నిర్వహించారు.