యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం పరిధిలోని ఉప ఆలయాలకు రక్షణ కరువైంది. గుప్త నిధుల కోసం గొల్లల దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం మధ్యాహ్నం పురావస్తుశాఖ అధికారులు గొల్లల ఆలయాన్ని శుభ్రం చేసేందుకు వెళ్లగా ఆలయ పైకప్పు కూలిపోయి నిచ్చెన వేసి ఉంది. దుండగులు లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. దుండగులు ఆలయంలో శివలింగం, శిల్పాలను పెకిలించినట్లు అనుమానిస్తున్నారు. ఆలయం లోపల పుష్పాకారంలో ఉన్న శిల్పం కింద గుప్త నిధి ఉందని అనుమానించి దానిని పగులగొట్టి పక్కన పడేశారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న గొల్లల ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో రెండేళ్ల క్రితం ఆలయంలోని శిల్పాలతో పాటు పునరుద్ధరించారు. ఆలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గేటుకు తాళం వేసి ఉంచారు.
ఆలయంలో ధూపదీప నైవేద్యాలు లేకున్నా.. ఆలయం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి భక్తుల దర్శనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ పురావస్తు శాఖ మాత్రం ఇప్పటికీ భక్తులను ఆలయంలోకి అనుమతించడం లేదు. ఆలయాలకు రక్షణ కల్పించడంలో పురావస్తు శాఖ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. యునెస్కో గుర్తింపు పొందిన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే ప్రసిద్ధ శైవక్షేత్రంగా రామప్ప దేవాలయం నిలుస్తోంది. దీనిని పరిరక్షించి సంరక్షించాల్సిన బాధ్యత పురావస్తు శాఖ అధికారులపై ఉందని భక్తులు కోరుతున్నారు. ఆలయానికి జరిగిన నష్టంపై పురావస్తు శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.