అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు సహా నలుగురు భారతీయులు దుర్మరణం చెందారు. టెక్సాస్ రాష్ట్రంలోని అన్నాలోని రోడ్డు నంబర్ 75లో శుక్రవారం వరుసగా 5 వాహనాలు ఒకదానికొకటి అతి వేగంతో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులు దుర్మరణం చెందారు. తెలుగువారు ముగ్గురూ హైదరాబాద్ వాసులు కాగా, మరొకరు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఓరంపాటి ఆర్యన్ రఘునాథ్, ఫారూక్ షేక్, పాలచర్ల లోకేశ్, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్‌గా గుర్తించామని అక్కడి అధికారులు తెలిపారు.
గత శుక్రవారం బెన్‌టోన్‌విల్లేకు వెళ్లేందుకు ఈ నలుగురు ఒకే వాహనంలో ప్రయాణించారు. వీరు ప్రయాణిస్తున్న వాహనానికి భారీ మంటలు అంటుకున్నాయి. మంటలు అంటుకోవడంతో బయటకు రాలేకపోయారు. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోవడంతో కార్ పూలింగ్ యాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా అక్కడి అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటన టెక్సాస్‌లోని భారతీయ ప్రవాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది.