రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మల్కంచెరువు సమీపంలో వేగంగా వచ్చిన కారు ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్న చరణ్ (19)గా పోలీసులు గుర్తించారు. షిఫ్ట్ డిజైర్ కారు అతివేగంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అయితే పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి చరణ్ అప్పటికే కారులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చరణ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
బీఎన్ఆర్ హిల్స్ నుంచి మెహదీపట్నంలోని తన ఇంటికి చరణ్ వెళ్తున్నట్లు సమాచారం. ఆ సమయంలో కారు ఫ్లైఓవర్ గోడను ఢీకొని ప్రమాదానికి గురైంది. కారు నుజ్జునుజ్జు కావడంతో పాటు ఇరుక్కుపోయిన మృతదేహాన్ని అతికష్టమ్మీద బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగినప్పుడు కారులో చరణ్ ఒక్కడే ఉన్నాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.