పాస్‌పోర్ట్ సర్వీస్ పోర్టల్ నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాల కారణంగా పాస్‌పోర్ట్ సేవలకు అంతరాయం కలగనుందని కేంద్రం తెలిపింది. ఐదు రోజుల పాటు పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులో ఉండవని విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే బుక్ చేసుకున్న అపాయింట్ మెంట్లను రీషెడ్యూల్ చేస్తామని వివరించారు. రీషెడ్యూల్ చేసిన వివరాలను ఆయా అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం అందజేస్తామని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ సేవలు గురువారం (ఆగస్టు 29) రాత్రి 8 గంటల నుండి బంద్ అవుతాయని చెప్పారు.
సెప్టెంబర్ 2 వరకు కొత్త అపాయింట్‌మెంట్లను బుక్ చేసుకునే అవకాశం లేదన్నారు. కొత్తగా పాస్ పోర్ట్ తీసుకోవడానికి, పాత పాస్ పోర్ట్ రెన్యూవల్ తదితర సేవలు పొందేందుకు అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవడానికి ఈ ఆన్ లైన్ సేవా పోర్టల్ ఉపయోగపడుతుంది. పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ కారణంగా గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని నేరుగా ఆ సమయానికి వెళ్లవచ్చు. కాగా, సాంకేతిక నిర్వహణలో భాగంగా ఐదు రోజుల పాటు ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులో లేకపోవడంతో పాస్ పోర్ట్ సేవలను పొందేందుకు వారికి కొంత అసౌకర్యం తప్పదని అధికారులు తెలిపారు.