సిద్దిపేటలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనుల కోసం ప్రజలు ఎన్ని సార్లు దరఖాస్తులు పెట్టాలని ప్రశ్నించారు. దరఖాస్తు పెట్టినప్పుడల్లా 40 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, గతంలో ఇచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా మూలకు పడేశారని, దరఖాస్తుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. అదేవిధంగా, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తమ మోసం విధానాలను ప్రకటించిందని అన్నారు. రుణమాఫీ అయిపోయిందని సీఎం రేవంత్ హైదరాబాద్ లో మాట్లాడుతున్నారని, కానీ, ప్రజాపాలనలో రుణమాఫీ కాలేదని, దరఖాస్తులు వస్తున్నాయని హరీష్ రావు అన్నారు.
మహబూబ్ నగర్ లో నవంబర్ 30 నాడు 2750 కోట్లు ఇస్తున్నానని చెప్పారని, కానీ, సీఎం రేవంత్ డమ్మీ చెక్ ఇచ్చారా? అని హరీష్ రావు ప్రశ్నించారు.మోసాలు తప్ప నీతి, నిజాయితీ లేనిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్ని రుణమాఫీలు, ఎంతమందికి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరిన్ని సంఘటనలను గుర్తు చేస్తూ, వానాకాలం రైతుబంధు ఎప్పుడు ఇస్తారో రేవంత్ చెప్పాలని హరీష్ రావు అన్నారు. నిన్న ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.