కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి ప్రారంభించనున్న కుల గణనపై ప్రజలు, మేధావులు, వివిధ సామాజిక వర్గాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఆయన ఇక్కడికి రానున్నారు. పీసీసీ ఆధ్వర్యంలో బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో వైద్యుల సమావేశంలో రాహుల్ పాల్గొంటారు. సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి 5.20 గంటలకు రోడ్డు మార్గంలో బోయిన్ పల్లిలోని గాంధీ భావజాల కేంద్రానికి వెళ్తారు. సాయంత్రం 5. 30 గంటలకు కుల గణనపై నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. సరిగ్గా గంటపాటు జరిగే ఈ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ 7.10 గంటలకు రోడ్డు మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి బయలుదేరి వెళతారు.

అయితే, రాహుల్ గాంధీ పాల్గొననున్న ఈ మీటింగ్ కు మీడియాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన లైవ్ సిగ్నల్స్ యొక్క లింక్ ను తెలంగాణ కాంగ్రెస్ తరఫున మీడియాకు అందుబాటులో ఉంచుతామని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు పాల్గొంటారు. మరో 200 మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారితో పాటు రిటైర్డ్ జడ్జిలు, ప్రొఫెసర్లు, కవులు, కళాకారులు, మేధావులు పాల్గొనే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *