అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కు జై షా నూతన చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నాలుగు సంవత్సరాలుగా ఐసీసీ చైర్మన్ గా కొనసాగిన గ్రెగ్ బార్ క్లే ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. నవంబర్ 30తో పదవీ విరమణ చేయనున్నారు. మరోసారి అతడు ఐసీసీ చైర్మన్ పదవిలో కొనసాగేందుకు విముఖత వ్యక్తం చేశారు. ఫలితంగా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా ఐసీసీ నూతన చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇతరులు ఎవరూ ఐసీసీ చైర్మన్ రేసులో నిలవకపోవడంతో జై షా ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. రెండేళ్ల పాటు అతడు పదవిలో కొనసాగనున్నారు. భారత్ నుంచి ఐసీసీ చైర్మన్ పదవిని అధిష్టించిన మూడో వ్యక్తిగా జై షా నిలిచారు. ఐసీసీ నూతన చైర్మన్ గా ఎన్నికవడం పట్ల జై షా హర్షం వ్యక్తం చేశారు. ఐసీసీ బృందంతో, ఇతర సభ్య దేశాలతో కలిసి క్రికెట్ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు.
గతంలో ఎన్. శ్రీనివాసన్ 2014 నుంచి 2015 మధ్య ఏడాది పాటు ఐసీసీ చైర్మన్ గా కొనసాగారు. అనంతరం శశాంక్ మనోహర్ నవంబర్ 2015 నుంచి జూన్ 2020 వరకు దాదాపు నాలుగేళ్లకు పైగా ఐసీసీ చైర్మన్ గా కొనసాగారు. ఈ వరుసలో జై షా ఐసీసీ చైర్మన్ పీఠం అధిష్ఠించనున్నారు.