పారాలింపిక్స్-2024 విశ్వ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పారిస్ వేదికగా అంగరంగ వైభవంగా మరో విశ్వ క్రీడలు మొదలయ్యాయి. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పారాలింపిక్స్-2024ను ప్రారంభించినట్లు అధికారిక ప్రకటన చేశారు. ఫ్రాన్స్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆరంభ వేడుకలను నిర్వహించారు. పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాగా ప్రారంభ కార్యక్రమంలో 167 దేశాలకు చెందిన మొత్తం 4,400 మంది పారాలింపియన్లు పాల్గొన్నారు. చాంప్స్-ఎలీసీస్ నుంచి ప్లేస్ డీ లా కాంకోర్డ్ మైదానం వరకు కవాతు చేశారు.
భారత్ బృందానికి పారా-అథ్లెట్‌లు సుమిత్ యాంటిల్, భాగ్యశ్రీ జాదవ్ నాయకత్వం వహించారు. పారాలింపిక్స్‌లో భారత్ 84 మందితో బరిలోకి దిగనుంది. అథ్లెటిక్స్ (38), బ్యాడ్మింటన్ (13), షూటింగ్ (10), ఆర్చరీ (6), పవర్‌లిఫ్టింగ్ (4), పారా కనోయింగ్ (3), సైక్లింగ్, జూడో, టేబుల్ టెన్నిస్, రోయింగ్ (2), తైక్వాండో, స్విమ్మింగ్ (1) మన అథ్లెట్లు పోటీపడుతున్నారు. ఒలింపిక్స్‌లో ఇంతపెద్ద సంఖ్యలో భారత పారా అథ్లెట్లు పాల్గొనడం చరిత్రలో ఇదే తొలిసారి. కాగా తొలి రోజున భారత అథ్లెట్లు పలు విభాగాల్లో తలపడనున్నారు.