విజయవాడ : విజయవాడలో శుక్రవారం వేలాది మంది భక్తులు పాల్గొనగా ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఎంజీ రోడ్డులోని డి అడ్రస్ మాల్ దగ్గర పూజలు నిర్వహించి రథయాత్ర ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో భక్తులు, కళాకారులు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. యాత్ర పీవీపీ మాల్, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, పాలీ క్లినిక్ రోడ్డు, గాయత్రీనగర్, గురునానక్ కాలనీ, ఫన్ టైమ్ రోడ్, ఆర్టీసీ కాలనీ, పంట కాలువ రోడ్డు, కృష్ణవేణి రోడ్డు, కృష్ణలంక, రామలింగేశ్వర్ నగర్ మీదుగా సాగి చివరకు ఇస్కాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుండిచా మందిరానికి చేరుకుంది. స్క్యూ బ్రిడ్జి దగ్గర జగన్నాథ మందిరం. రథయాత్రలో గనులు, భూగర్భశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సమాచార పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తదితరులు పాల్గొన్నారు. యాత్రను పురస్కరించుకుని నాయకులు ఆరతి సమర్పించి ప్రార్థనలు చేశారు. సహకరించిన మంత్రులు, ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులకు ఇస్కాన్ ఆలయ అధ్యక్షుడు శ్రీమాన్ చక్రధారి దాస్ కృతజ్ఞతలు తెలిపారు.