ఆశ్వయుజ శుద్ధ పంచమి (సోమవారం) నాడు అలిగిన బతుకమ్మగా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట. అందుకని ఈ రోజు బతుకమ్మ అలిగి ఏదీ తినదంటారు. కాబట్టి ఈ రోజు పూలతో బతుకమ్మలను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా ఏదీ సమర్పించరు. బతుకమ్మ అలక తీరాలని మహిళలందరూ కలిసి ప్రార్థిస్తారు. అలిగిన బతుకమ్మపై మరో చరిత్ర కూడా ఉంది. దేవీభాగవతం ప్రకారం నవరాత్రుల్లో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాల్లో రాక్షస సంహారం చేసిందని చెబుతారు. భండాసురుణ్ని, చండముండల్ని సంహరించిన తర్వాత అలసిపోయిన అమ్మవారికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలని ఆరోనాడు బతుకమ్మ ఆడరు. దానినే అర్రెం అనీ, అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. కాలక్రమంలో అదే అలిగిన బతుకమ్మగా పేరు స్థిరపడిపోయింది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా జరుగుతున్నాయి. ఐదవరోజుకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు చేరుకున్నాయి. తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఒక్కో ఆలయంలో ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శమనిస్తుంటారు అమ్మవారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివెళ్తారు. దుర్గాష్టమితో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.