ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు నుండి 12వ తేదీ వరకూ రోజుకో అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీగా సందడి వాతావరణం నెలకొంది.
ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో నిత్యం లక్షకుపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారని అంచనాతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద భక్తుల రద్దీని సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మరో పక్క ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలను భక్తులు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ ను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.