విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రి పై నేడు దుర్గమ్మ మహిషాసుర మర్దని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచే భక్తులు క్యూలో నిల్చున్నారు. క్యూ అంతా భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్‌లో ఉన్న మహిళలు, చిన్న పిల్లలు ఇబ్బంది పడకుండా ఆలయ సిబ్బంది భక్తులకు ఉచితంగా పాలు, మజ్జిగ, మంచినీరు అందచేస్తున్నారు.
మహిషాసుర మర్థనిగా అమ్మవారిని చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి రావడంతో ఇంద్రీకీలాద్రి కిటకిటలాడిపోతుంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. క్యూలైన్ లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆలయ అధికారులు వెల్లడించారు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేసి లోకం సుఖ శాంతులతో కాపాడేలా దీవెనలందిస్తుంది అమ్మవారు. ఈరోజు అమ్మను దర్శించుకుంటే ఆపదలు, భయాలు.. ఇతర అడ్డంకులు తొలిగిపోతాయన్నది భక్తుల నమ్మకం.