కేదారనాథ్ : ఉత్తరాఖండ్‌లోని శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం కనిపించడం లేదంటూ జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. కేదార్‌నాథ్‌లో బంగారం కుంభకోణం జరిగిందని, ఆ విషయాన్ని ఎందుకు లేవనెత్తడం లేదని ఆయన ప్రశ్నించారు.  ‘‘అక్కడ స్కామ్ చేసి ఢిల్లీలో కేదార్‌నాథ్‌ను నిర్మిస్తారా? అలా చేస్తే మరో కుంభకోణం జరుగుతుంది. కేదార్‌నాథ్‌ ఆలయంలో 228 కేజీల పసిడి లేదు. దర్యాప్తు కూడా మొదలుపెట్టలేదు. దీనికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు ఢిల్లీలో కేదార్‌నాథ్‌ ఆలయాన్ని నిర్మిస్తామని చెబుతున్నారు. అలా జరగడానికి వీల్లేదు’’ అని అవిముక్తేశ్వరానంద అన్నారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలో కేథార్‌నాథ్ ఆలయం నిర్మాణానికి జులై 10న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా పాల్గొన్నారు. అయితే ఢిల్లీలో ఆలయ నిర్మాణం పట్ల నిరసన తెలుపుతూ అవిముక్తేశ్వరానంద ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా త‌న‌కు ప్రణామాలు చేశార‌ని పేర్కొన్న జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి.. త‌మ వద్దకు వ‌చ్చిన‌వారిని దీవించ‌డం త‌మ విధాన‌మ‌ని స్పష్టం చేశారు. అయితే ప్రధాని మోదీ త‌మ‌కు శ‌త్రువు కాదని.. ఎల్లప్పుడూ ఆయ‌న శుభం కోరుకునేవాళ్లమ‌ని తేల్చి చెప్పారు. ప్రధాని సంక్షేమం గురించి తాము ఆలోచిస్తామ‌ని.. కానీ ఒక‌వేళ ఆయ‌న త‌ప్పు చేస్తే.. దాన్ని కూడా ఎత్తి చూపుతామ‌ని అవిముక్తేశ్వరానంద తెలిపారు.

కేదార్‌నాథ్ ఆలయంలో జరిగిన ఈ బంగారం కుంభకోణంపై దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉందని ఆయన తేల్చి చెప్పారు. దర్యాప్తు జరపాలంటూ తాను ఇది వరకే డిమాండ్ చేసినప్పటికీ ఎలాంటి స్పందనా రాలేదని పేర్కొన్నారు. ముంబైలో పర్యటించిన అవిముక్తేశ్వరానంద.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన ఉద్ధవ్ ఠాక్రే అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో సుమారు 2 గంటల పాటు భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో హిందువులం అని చెప్పుకొంటున్న వారు కేదార్‌నాథ్‌లో బంగారం కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. ఇప్పుడు వాళ్లే ఢిల్లీలో కూడా కేదార్‌నాథ్ ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ఆలయ నిర్మాణం పేరుతో మరో కుంభకోణానికి తెర తీయనున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్మించాలనుకుంటున్న కేదార్‌నాథ్ ఆలయం ఎప్పటికీ జ్యోతిర్లింగం కాబోదని తేల్చి చెప్పారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయని.. ఇందులో ఒకటి హిమాలయాల్లో వెలిసిందని శివపురాణం చెబుతోందని పేర్కొన్న అవిముక్తేశ్వరానంద.. అలాంటప్పుడు ఢిల్లీలో నిర్మించే ఆలయం జ్యోతిర్లింగం ఎలా అవుతుందని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *