నిర్మల్ జిల్లా బాసరలో శారదీయ శరన్నరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వచ్చే నెల 03.10.2024 నుంచి 12.10.2024 వరకు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారు ప్రతిరోజూ వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వడం ఆనవాయితీ. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రగంట, నాల్గవ రోజు కూష్మాండ అవతారం, ఐదవ రోజు స్కందమాత, ఆరవ రోజు కాత్యాయనీ అవతారం, ఏడో రోజు కాళరాత్రి అలంకారం, ఎనిమిదో రోజు మహా గౌరీ, తొమ్మిదో రోజు సిద్ధ ధాత్రి అలంకారం భక్తులకు దర్శనమిస్తాయి.
ఈ తొమ్మిది రోజులూ అమ్మవార్లకు ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పిస్తారు. అయితే దీనిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, పోలీసులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ నేపథ్యంలో అమ్మవారి ఉత్సవంలో భాగంగా.. పలు సేవలను రద్దు చేసేందుకు ఈఓ ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులు వీటిని ఆచరించి అమ్మవారి సేవలో పాల్గొనాలని సూచించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.