పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తరాంధ్ర అధికారులు సిద్ధమయ్యారు. పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లు బారులు తీరారు. మరోవైపు భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్‌లో టెంట్లు వేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు, హుకుంపేటలోని సిరిమానుకు పసుపు పుష్పాలు సమర్పించారు. అమ్మవారి జయంతి సందర్భంగా నగర పాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, 120 వరకు బయో టాయిలెట్లను సిద్ధం చేసింది. దీంతోపాటు పారిశుధ్య పనులకు మరో 330 మందిని నియమించారు. వీరంతా మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు. గుడి చుట్టూ సిరిమాను పరిసర ప్రాంతాల్లో 620 మంది నేరుగా పని చేయనున్నారు. విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి జాతర నేపథ్యంలో నేడు ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఇప్పటికే ఉత్తర్వులు అందాయి.
ఇక, పైడితల్లి అమ్మా వారి సిరిమానోత్సవానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 80 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. అంతేకాకుండా బందోబస్తులో ఉన్న పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలు ఇచ్చారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 61 మంది సీఐలు, ఆస్ఐలు, 147 మంది ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, 17 మంది మహిళా ఎస్సైలు, 425 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 136 మంది మహిళా కానిస్టేబుళ్లు, 369 మంది హోంగార్డులు, 200 మంది ఏఆర్ సిబ్బందిని బందోబస్తు కోసం నియమించింది ప్రభుత్వం. జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి పోలీసులను రప్పించారు.