ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికులు, సిబ్బందికి తెలియకుండా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. వాటి వల్ల ఆలయానికి ఎలాంటి హాని కలగకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 15-16 శతాబ్దాలలో తిరుమలలో ఈ పవిత్ర ఉత్సవాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. 1962లో దేవస్థానం పండుగను పునరుద్ధరించింది.
ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఆలయంలోని నాలుగు మాడవీధులో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 15న పవిత్ర ప్రతిష్ట, 16న పవిత్ర సమర్పణ, 17న పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి.