తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాసం సందడి మొదలైంది. శ్రావణ మాసం అంతా పండుగ సందడితో ఉంటుంది. నేడు శ్రావణ మాసం తొలిరోజు, శుక్రవారం నాగుల పంచమి కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, శ్రీ లక్ష్మీగణపతి స్వామివారికి అభిషేకం, అనంతరం శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి మహాన్యాస, ఏకాదశ రుద్రాభిషేకం, షోడశోప చార పూజలు నిర్వహించారు. సాయంత్రం మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రాజన్న ఆలయంలో స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. భక్తులకు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ చవితి రోజు భక్తులు నాగా దేవతకు పూజ చేసి నైవేద్యాలను సమర్పించడం ద్వారా సర్వరోగాలు పోయి సౌభాగ్యులవుతారని విశ్వసిస్తారు. కుజ దోషం, కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడ, తిరుపతి, విజయవాడ దుర్గమ్మ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంలో పూజలు నిర్వహిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ఆలయాల్లో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన భద్రతా చర్యలతో పాటు భక్తుల సౌకర్యార్థం పలు చర్యలు తీసుకుంటున్నారు. , రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాల్లో రోజువారీ పూజా కార్యక్రమాలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.