తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రతం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం. వ్రతాన్ని మహిళలందరూ తప్పనిసరిగా చేసుకుంటారు. కలశ స్థాపన చేసి అందంగా అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసుకుని ముత్తైదువులను పిలిచి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం ఒక్కరు చేసుకునేది కాదు. ముత్తైదువులను పిలిచి సంతోషంగా మనతో పాటు వారికి కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ చేసుకుంటారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఏపీ, తెలంగాణ ఆలయాల్లో దుర్గమ్మ వారు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. అటు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అమ్మవారు వరలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కృష్ణా ఘాట్‌లో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

అమ్మవారికి గాజులు, కొత్త చీరలు సమర్పిస్తున్నారు. కొబ్బరి కాయలు కొట్టి తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. శ్రావణ మాసంలో ప్రతి రోజూ శుభదినమని, శుక్రవారం రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల తమ సౌభాగ్యాన్ని అమ్మవారు చల్లగా చూస్తుందని భక్తులు చెబుతున్నారు. ఈ వేడుకలతో విజయవాడ నగరంలో వరలక్ష్మీ వ్రతం శోభ నెలకొంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *