బడ్జెట్ 2024: ఈ ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయాలని ఆర్థిక సంస్థలు చెబుతున్నాయి. దీంతో దేశంలోని లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. అయితే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉండటంతో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిని అమలు చేయాలని పలు కమిటీలు డిమాండ్ చేస్తున్నాయి.
కోటి మంది ఉద్యోగులకు లబ్ధి
బడ్జెట్ 2024 తేదీ సమీపిస్తున్న కొద్దీ, అనేక సిబ్బంది కమిటీలు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు, కేంద్ర ఉద్యోగుల జీతం, అలవెన్సులు, పెన్షన్‌తో సహా అనేక ప్రయోజనాలను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని, 18 నెలల డియర్‌నెస్‌ను విడుదల చేయాలంటున్నారు. కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీకి రాసిన లేఖలో సెంట్రల్ ఎంప్లాయీస్ అండ్ లేబర్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎస్‌బీ యాదవ్ కూడా ఇప్పటికే డిమాండ్ చేశారు. ఉద్యోగులకు భత్యం, కోవిడ్-19 మహమ్మారి సమయంలో పెన్షనర్లకు ఉపశమనం కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఎనిమిదో వేతన కమిషన్‌ను అమలు చేస్తే కోటి మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
ఇప్పటికే 7వ వేతన సంఘం
ప్రతి 10 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల జీతాలు, భత్యాలు సహా అన్ని రకాల ప్రయోజనాలను సమీక్షిస్తుంది. ఆ క్రమంలో పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. వేతన సంఘం ఉద్యోగుల సమీక్ష నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తర్వాత పే కమిషన్ అమలు చేయబడుతుంది. ఏడవ వేతన సంఘాన్ని ఫిబ్రవరి 28, 2014న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏడవ వేతన సంఘం జనవరి 1, 2016న అమలులోకి వచ్చింది. దీంతో ఈ నియమం ప్రకారం ఎనిమిదవ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2024 బడ్జెట్‌లో పే కమిషన్ ఏర్పాటుకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.