సరదాగా ఆడిన ఆట నిండు ప్రాణాన్ని బలితీసింది. ఝలావర్‌లో క్రికెట్ మ్యాచ్ తర్వాత ఒకరు తన స్నేహితుడి తలపై కొట్టడంతో 15 ఏళ్ల బాలుడు హత్యకు గురైనట్లు పోలీసులు బుధవారం తెలిపారు. భవానీ మండి పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆటలో ఓడిపోయిన తర్వాత ప్రత్యర్థి జట్టు సభ్యుడు బాలుడి తలపై బ్యాట్‌తో కొట్టాడని పోలీసులు కేసు నమోదు చేశారు. తలకు గాయాలైన యువకుడు చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. భవానీ మండి పట్టణంలోని రాజస్థాన్ టెక్స్టైల్స్ మిల్స్ లేబర్ కాలనీకి చెందిన ప్రకాష్ సాహు అనే వ్యక్తికి బుధవారం పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని అదే కాలనీకి చెందిన ముఖేష్ మీనా (20)గా గుర్తించారు.
సీన్ కట్ చేస్తే.. 10వ తరగతి చదువుతున్న సాహు, బీఏ చివరి సంవత్సరం చదువుతున్న మీనా స్నేహితులు అని, కాలనీ గ్రౌండ్లో రోజూ క్రికెట్ ఆడతారని సర్కిల్ ఇన్స్పెక్టర్ మంగీలాల్ యాదవ్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం సాహు తన జట్టు సభ్యులతో కలిసి క్రికెట్ మ్యాచ్‌లో విజయాన్ని సంబరాలు చేసుకుంటుండగా, గేమ్ ఓడిపోవడంపై మీనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుక నుంచి వచ్చి క్రికెట్ బ్యాట్‌తో సాహు తలపై బలంగా కొట్టాడు. సాహు అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యులు కోటాకు రెఫర్ చేశారు. మంగళవారం అర్థరాత్రి కోటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడని సీఐ యాదవ్ తెలిపారు. మీనాపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తెల్లవారుజామున, స్థానిక కూలీలు నిందితుడి బైక్‌ను ధ్వంసం చేశారని, అతని కుటుంబ సభ్యులను గదిలో బంధించారని పోలీసులు తెలిపారు. దీంతో కాలనీలో పోలీసుల భద్రతను పెంచారు.