కన్న తల్లి కనికరం లేకుండా అప్పుడే పుట్టిన ఆడబిడ్డను పొదల్లోకి విసిరేసింది. పాప ఏడుపు విన్న ఓ ఆటో డ్రైవర్ కు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న పసికందు కనిపించింది. ఈ ఘటన గౌడవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం విజయ్‌పూర్‌కు చెందిన తులసి, సంతోష్‌ దంపతులు గౌడవెల్లి గ్రామ సమీపంలోని స్టార్‌ పౌల్ట్రీ ఫామ్‌లో ఆరేళ్లుగా కూలీలుగా పనిచేస్తున్నారు. గర్భిణి అయిన తులసిని వైద్య పరీక్షల నిమిత్తం ఆమె భర్త సంతోష్ సోమవారం మేడ్చల్ లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. కోళ్ల ఫారం నుంచి తిరిగి వస్తుండగా తులసికి నొప్పులు మొదలయ్యాయి. దారిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

స్థలం నిర్మానుష్యంగా ఉండడంతో పసికందును దుప్పటిలో చుట్టి రోడ్డుపక్కన ఉన్న ముళ్ల పొదల్లో వదిలేసి భర్తతో కలిసి కోళ్ల ఫారం నుంచి వెళ్లిపోయింది. అయితే గౌడవెల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్‌కు పాప ఏడుపు వినిపించింది. ఆ వ్యక్తి స్థానికులకు సమాచారం అందించగా గ్రామ కార్యదర్శి మహిపాల్‌రెడ్డికి సమాచారం అందించారు. దీంతో కార్యదర్శి తన సిబ్బందితో ముళ్లపొదల్లోకి చేరుకుని వెతకగా, పొదల మధ్య రక్తపు మడుగులో ఓ పాప ఏడుస్తూ కనిపించింది. స్థానిక ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్ లక్ష్మి పొదల్లో నుంచి శిశువును బయటకు తీశారు.

అనంతరం తల్లిదండ్రుల గూర్చి ఆరాతీయగా అక్కడే ఉన్న ఛత్తీస్గఢ్ కు చెందిన వ్యక్తులు శిశువును కనిపారేసిన వారి వివరాలు చెప్పడంతో కార్యదర్శి పౌల్ట్రీఫామ్ వద్దకు వెళ్లాడు. తులసి, ఆమె భర్తను నిలదీశారు. పాప తమదేనని ఒప్పుకోవడంతో తులసిని మేడ్చల్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమె భర్త సంతోష్ నీ మేడ్చల్ పోలీసులకు అప్పగించారు. కాగా తనకు పుట్టిన బిడ్డ చనిపోయిందనుకుని దుప్పటిలో చుట్టేసి పొదల్లో వదిలేశానని, అయితే శిశువు బతికుందని అధికారులు తెలపడంతో నేనే పెంచుకుంటానని తులసి తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *