కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలిపి కూతురిని హత్య చేసిన తండ్రి, ఈ ఘటన మెదక్ జిల్లాలో సంచలనం రేపింది.ఈ సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని శేరీల గ్రామంలో రెండు నెలల క్రితం జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శేరిల గ్రామానికి చెందిన ఎక్కిరి సౌందర్య, శ్రీశైలం దంపతులకు కుమారుడు, నిఖిత అనే ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. ఆడుకుంటూ పాఠశాలకు వెళ్లే నిఖిత ఈ ఏడాది మే 31న అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైంది. పని ముగించుకుని ఇంటికి వచ్చిన సౌందర్య కుమార్తెను వెంటనే సమీపంలోని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిఖితను పరీక్షించిన వైద్యులు ఆమెను నీలోఫర్ ఆసుపత్రికి తరలించాలని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
నాలుగు రోజులుగా చికిత్స అందించిన వైద్యులు నిఖిత ప్రాణాలను కాపాడలేకపోయారు. అయితే ఆమెపై విష ప్రయోగం జరిగిందని వైద్యులు చెప్పడంతో సౌందర్యకు ఎవరు చేశారో అర్థం కాలేదు. తన కుమార్తె మృతికి కారణమేంటని సౌందర్య అనుమానం వ్యక్తం చేసింది. కొద్ది రోజులుగా అతడిని(శ్రీశైలం) నిశితంగా గమనిస్తున్న సౌందర్య తన సోదరుల సహకారంతో వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెల్దుర్తి పోలీసులు శ్రీశైలాన్ని క్షుణ్ణంగా విచారించగా తన కూతురిని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలిపి తన కూతురికి తాపించినట్టు శ్రీశైలం అంగీకరించాడు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.