ఈ సంఘటన ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కుక్కునూరు మండలంలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక గురువారం మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి వచ్చింది. అనంతరం బాలిక ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో సమీప బంధువు మడకం వెంకటేష్ (24) ట్రాక్టర్ నడుపుతూ వచ్చాడు. ఇతర పిల్లలతో ఆడుకుంటున్న బాలికను చూసిన వెంకటేష్ గోదావరిని చూపిస్తానని చెప్పి ట్రాక్టర్ ఎక్కించుకొని తీసుకెళ్లాడు.
అభం శుభం తెలియని ఆ చిన్నారి అతని మాటలు విని అతని వద్దకు వెళ్లింది. దారిలో ఓ హోటల్ దగ్గర ఆగి చిన్నారికి తినడానికి స్నాక్స్ కొనిచ్చాడు. అక్కడి నుంచి బాలికను గోదావరి నది వద్దకు తీసుకెళ్లి వరద ప్రవాహాన్ని చూపించాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అయితే దారిలో ట్రైబల్ కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) భవనం వద్ద ట్రాక్టర్‌ను ఆపి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన చిన్నారి తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు వివరించింది.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి శుక్రవారం గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుక్కునూరు ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడు వెంకటేష్‌ను అరెస్టు చేశారు.