హైదరాబాద్: హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో తల్లీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో తల్లి బలవన్మరణాన్ని చూసి కొడుకు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో నగరంలో విషాదాన్ని నింపింది. కొన్ని నెలల క్రితం గుంజు శివ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల గుంజి పద్మ కుటుంబ పోషణ, పిల్లల చదువుల ఖర్చులు భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసిన పెద్ద కుమారుడు గుంజి వంశీ కన్న తల్లిని చూసి చలించిపోయి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదంతా క్షణాల్లో జరగడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. మృతురాలి రెండో కుమారుడు తల్లి మరణవార్తను స్థానిక బంధువులు, స్థానికులకు చెప్పేందుకు వెళ్లగా.. అన్నయ్య కూడా ఆత్మహత్యకు పాల్పడడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. కండ్ల ముందే తల్లి, తోడ బుట్టినవాడు నన్ను ఒంటరిని చేసి వెళ్లి పోయారా అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై ఆరా తీశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.