రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఎర్రకుంట తండాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో ఆ దుర్మార్గుడు అబార్షన్ చేయించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలేం జరిగిందంటే తండ్రితో కలిసి పనికి వెళ్లి గిరిజన బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. భూమి యజమాని కృష్ణారెడ్డి (30) ఆమెను బెదిరించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనికి భయపడి ఆమె నోరు విప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది.
ఆ యజమాని బాలికను కొత్తూరుకు తీసుకెళ్లాడు. ప్రాణహాని ఉందని తెలిసినా వైద్యుడికి డబ్బులు ఇచ్చి అబార్షన్ చేయించాడు. ఈ విషయం బయటకు రాకుండా మంగళవారం తన వ్యవసాయ క్షేత్రంలో తండా, గ్రామపెద్దలను కూర్చోబెట్టి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఏదో పొరపాటు జరిగిందని, ఎంతో కొంత ఇచ్చి రాజీ పడతానని చెప్పాడు. బాలిక డబ్బులకు లొంగలేదు. మంగళవారం సాయంత్రం శంషాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కొత్తూర్ గ్రామంలోని శ్రీనివాస హాస్పిటల్ డాక్టర్ రంజిత్ రెడ్డి గర్భం తీసేసినట్లు తెలిసింది. నిందితుడు కృష్ణారెడ్డితో పాటు డాక్టర్ రంజిత్ రెడ్డి,మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.