జోగిపేటకు చెందిన రిటైర్డ్ విద్యుత్ కార్మికుడు రవీందర్ రెడ్డి తన కుమారుడు సాయికిరణ్ రెడ్డితో కలిసి సోమవారం స్థానిక ఎస్ బీఐ బ్యాంకు శాఖలో చెక్కు ద్వారా వారి ఖాతా నుంచి రూ.10 లక్షలు డ్రా చేశారు. డ్రా చేసిన డబ్బును ఓ బ్యాగ్ లో పెట్టి కారు ముందు సీట్లో పెట్టాడు. ఆ తర్వాత తండ్రీ కొడుకులిద్దరూ కారులో వెళ్లిపోయారు. అక్కడి నుంచి నాందేడ్-అకోలా ప్రధాన రహదారిపై జోగిపేట పోలీస్ స్టేషన్ మెయిన్ గేట్ ఎదురుగా కారు ఆపి మిఠాయిలు కొనుగోలు చేసేందుకు ఓ దుకాణానికి వెళ్లారు.

స్వీట్ బాక్స్ తీసుకొని కారు దగ్గరకి వచ్చేసరికి, కారు అద్దాలు పగలగొట్టి ఉండటంతో రవీందర్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డిలు షాక్ కు గురయ్యారు. కారులో ఎంత వెతికినా డబ్బు బ్యాగ్ కనిపించలేదు. నిమిషాల వ్యవధిలోనే కొందరు గుర్తు తెలియని దుండగులు కారు అద్దాలు పగులగొట్టి పది లక్షలు అపహరించారు.రవీందర్ రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ అనిల్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి బ్యాంకుకు చేరుకుని బ్యాంకులోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితుడు రవీందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *