బాపట్ల జిల్లా చెరుకుపల్లి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన ఇద్దరు బాలికలు గుంటూరు నగరంలో జూనియర్ ఇంటర్‌లో చేరారు. పట్టాభిపురం చంద్రమౌళీశ్వర అగ్రహారలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్నారు. గుంటూరు జిల్లా స్పెషల్ బ్రాంచ్ లో సీఐగా పనిచేస్తున్న ఓ అధికారి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న పగడాల గోపితో వారం రోజుల క్రితం ఓ బాలికకి పరిచయం ఏర్పడింది. హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్తున్న సమయంలో బాలికతో మాట్లాడాడు. ఈ సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గోపి తన స్నేహితుడు మణికంఠతో కలిసి హాస్టల్‌కు వచ్చాడు. ఆ సమయంలో హాస్టల్ వాచ్‌మెన్, వార్డెన్ లేరు. అస్వస్థతకు గురైన బాలికను చూసేందుకు తల్లిదండ్రులు రావడంతో మహిళా భద్రతా సిబ్బంది విద్యార్థినిని హాస్టల్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం.
ఈ సమయంలో ఇంటర్ విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు వచ్చారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు. బయటకు వచ్చిన విద్యార్థులను గోపి, మణికంఠ తమ ద్విచక్ర వాహనంపై అడవి తక్కెళ్ళపా డులోని రాజీవ్ గృహకల్ప అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లారు. గదిలోకి తీసుకెళ్లి రాత్రంతా దురుసుగా ప్రవర్తించారు. గోపి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి నుంచి హాస్టల్లో బాలికలు కనిపించడం లేదని వార్డెన్ అనురాధ మంగళవారం పట్టాభిపురం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. బాలికల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం నిందితులు ద్విచక్రవాహనాలపై బాలికలను హాస్టల్ వద్దకు తెచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.