భోపాల్: వివాహితను తమ కుమారుడు ఈవ్ టీజింగ్ చేశాడని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్ గ్రామంలో దళిత జంటను స్తంభానికి కట్టేసి, కొట్టి, ఆపై బూట్ల దండలు వేయించారని పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన అశోక్ నగర్ జిల్లా ముంగవోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కిలోరా గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వివాహితను తమ కుమారుడు ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణకు ప్రతీకారం తీర్చుకునేందుకు గ్రామంలోని కొందరు వ్యక్తులు 65 ఏళ్ల వృద్ధుడు, అతని భార్య (60)ని శారీరకంగా హింసించి అవమానించారు.
వృద్ధ దంపతులను గ్రామంలోని స్తంభానికి కట్టేసి, కొట్టి, ఆపై బూట్ల దండలు వేయించి నిందితులు చేశారని పోలీసులు తెలిపారు. బాధిత మహిళ శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు పది మందిపై కేసు నమోదు చేశారు. ఆ దంపతుల కుమారుడు నిందితుల్లో ఒకరి భార్యపై ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డాడని, ఆ తర్వాత దళిత కుటుంబం గ్రామాన్ని విడిచిపెట్టిందని ముంగవోలి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ గబ్బర్ సింగ్ గుర్జార్ తెలిపారు.