మధ్య ఆఫ్రికా దేశమైన కాంగో తూర్పు ప్రాంతంలోని కివు సరస్సుపై గురువారం వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడడంతో 78 మంది చనిపోయారు. ఈ మేరకు స్థానిక అధికారి ఒకరు సమాచారం అందించారు. ఘటన జరిగిన సమయంలో 278 మంది ఉన్నారని దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ జీన్-జాక్వెస్ పురుస్సీ తెలిపారు. ఈ ఘటనలో 78 మంది మృతి చెందారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.
అంతకుముందు, బోటులో దాని సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కిటుకు రేవుకు కొన్ని మీటర్ల దూరంలో పడవ మునిగిపోయింది. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని మినోవా నుండి ఉత్తర కివు ప్రావిన్స్‌లోని గోమాకు పడవ ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇదివరకు జూన్‌లో రాజధాని కిన్షాసా సమీపంలో ఫెర్రీ మునిగిపోవడంతో 80 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.