బ్రెజిల్ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలోని విన్హెడో నివాస ప్రాంతంలో 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో ప్రజలలో ఆందోళన నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. విమానం సావో పాలోలోని గౌరుల్‌హోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో సావో పాలో రాష్ట్రంలోని విన్హెడావో ప్రాంతంలో ఫ్లైట్ 2283-PS-VPB ప్రమాదానికి గురైనట్లు ధృవీకరించింది. ఈ మేరకు విమానయాన సంస్థ VoePass తెలిపింది.
అగ్నిమాపక సిబ్బంది, మిలటరీ పోలీసులు, సివిల్ డిఫెన్స్ బృందాలు ప్రమాద స్థలానికి తరలివెళ్లాయి. విమానం ఆకాశం నుంచి నేలపైకి పడిపోతున్న దృశ్యాలను కెమెరాలో కనిపించడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయితుంది. విమానం చెట్ల సమూహంలోకి పడిపోతున్నట్లు కనిపించింది. దాని తర్వాత పెద్ద ఎత్తున నల్లటి పొగలు కన్పించాయి. ఈ దుర్ఘటనలో మొత్తం ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న 62మంది మరణించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మృతుల సంఖ్యపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.