వియత్నాంలో యాగీ తుపాన్ బీభత్సం సృష్టిస్తున్నది. తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలు, వరదలతో శనివారం నుంచి ఇప్పటిదాకా కొండచరియలు విరిగిపడటం, భారీ వరదల కారణంగా ఏకంగా 141 మంది మృతిచెందారు. మరో 59 మంది గల్లంతయ్యారని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఒకచోట స్టీల్ బ్రిడ్జీ ఒక్కసారిగా కూలిపోవడంతో దానిపై వెళ్తున్న కార్లు, ట్రక్కులు వరదలో పడి కొట్టుకు పోయాయి. ఇక మృతుల్లో 29 మంది కావో బ్యాంగ్ ప్రావిన్స్‌కు చెందినవారు, 45 మంది లావో కై ప్రావిన్స్‌కు చెందినవారు, 37 మంది యెన్ బాయి ప్రావిన్స్‌కు చెందినవారు ఉన్నట్లు వెల్లడించింది. క్యూయెట్ థాంగ్ కమ్యూన్ గుండా ప్రవహించే డైక్ నదికి పోటెత్తిన భారీ వరద నీటి కారణంగా పొంగిపొర్లిందని తుయెన్ క్వాంగ్ ప్రావిన్స్ స్థానిక అధికారులు మంగళవారం ధ్రువీకరించినట్లు వియత్నాం న్యూస్ ఏజెన్సీని ఉటంకిస్తూ జిన్హువా పేర్కొంది.
గత 30 ఏళ్లలో వియత్నాంలో వచ్చిన అత్యంత విధ్వంసకర తుపాను ఇదేనని అధికారులు చెబుతున్నారు. ఈ తుపాను ఉత్తర వియత్నాంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఉత్తర ప్రాంతాలలో లోతట్టు, నదీతీర ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. పర్వత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.