కృత్తిక, రోహిణి కార్తెలో ఎండలతో అల్లాడిపోయే జీవకోటికి మృగశిర కార్తె ప్రవేశంతో ఉపశమనం కలుగుతుంది. వర్షారంభానికి సూచనగా భావించే ఈ కార్తెలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దీంతో వాతావరణం చల్లబడి, ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతుంది. మృగశిర కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఏరువాక అంటే నాగటి చాలు. ఈ కాలంలో తొలకరి జల్లులు కురవగానే పొలాలు దున్ని పంటలు వేయటం ప్రారంభిస్తారు. మృగశిర కార్తె ఆరంభమైన రోజును వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం పేర్లతో పండగలా జరుపుకుంటారు. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బెల్లంలో ఇంగువ కలిపి తింటారు. ఇంగువ శరీర ఉష్ణోగ్రతను పెంచి వర్షకాలంలో వచ్చే జలుబు, ఇతర వ్యాధులను నియంత్రిస్తుంది. ఇక, మృగశిర కార్తె ప్రారంభం రోజు చేపలు, ఇతర మాంసాహారం తింటే వ్యాధులు దూరమవుతాయనేది బలమైన నమ్మకం. ఉబ్బసం (ఆస్తమా) రోగులకు ఏటా మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు.
మృగశిర నక్షత్ర కూటాన్ని కొందరు మృగం యొక్క శిరస్సు అని, మృగమే అని, మృగరూపం ధరించిన ప్రజాపతి అని, యజ్ఙోపవీతాన్ని ధరించిన పురుషుడని కొందరి అభిప్రాయం. మృగశిర నక్షత్రానికి అధిదేవత సోముడు అంటే చంద్రుడు. తైత్తిరీయ సంహితలో దీన్ని మృగశీర్ష అన్నారు. వేదంలో చాలా చోట్ల మృగశిర వృతశిరమే అని అభిప్రాయం ఉంది. వృత్రుని సంహరించి, లోకానికి వర్ష ప్రదానం చేసినవాడు ఇంద్రుడు. జ్యేష్ఠా నక్షత్రం ఇంద్ర దైవత్వం. ఇంద్ర, వృత్రులు ప్రతి స్పర్ధులు. జ్యేష్ఠా, మృగశిర నక్షత్రాలు కూడా ఆకాశంలో ప్రతిస్పర్తులే. తూర్పున జ్యేష్ఠ ఉదయించగానే పడమర మృగశిర అస్తమిస్తుంది. అంటే అప్పుడు సూర్యుడు మృగశిరతో కూడి ఉంటాడు. అదే మృగశిర కార్తె ప్రవేశం. మృగశిర ప్రవేశంతో వర్షాలు ఆరంభమై గ్రీష్మతాపం తగ్గి లోకం చల్లబడుతుంది.
మృగశిర కార్తె తేదీ: మృగశిర కార్తీకం (మృగశిర కార్తే) మృగశిర నక్షత్రం ద్వారా సూర్యుని ప్రవేశం మరియు సంచారాన్ని సూచిస్తుంది. ఇది సాధారణంగా ప్రతి నెల జూన్ 7 లేదా 8వ తేదీలలో వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, మృగశిర కార్తె వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరం, అనగా. 2024, మృగశిర కార్తి జూన్ 08, శనివారం వచ్చింది.
.