ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ లోని ఛమోలీ జిల్లాలో మంచు కొండ విరిగిపడిన ఘటనలో 57మంది కార్మికులు కొండ కింద చిక్కుకుపోయారు. వీరిలో 10మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు అధికారులు. మిగిలిన 47 మంది గల్లంతైనట్లు సమాచారం.రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం ( ఫిబ్రవరి 28, 2025 ) ఛమోలీ – బద్రీనాథ్ నేషనల్ హైవే సమీపంలోని మనా గ్రామం దగ్గర చోటు చేసుకుంది ఈ ప్రమాదం.
ఘటనాస్థలం దగ్గర రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పనిలో ఉన్న కార్మికులంతా మంచు కొండల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అధికార యంత్రంగం హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.