ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంత మంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా రీల్స్ చేస్తూ రాత్రికి రాత్రే స్టార్‌గా మారాలని కొందరు చేస్తున్న వింత పనులు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. రీల్స్ కోసం ఎంతోమంది తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కొంతమంది, స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట వెలుగు చూస్తున్నా మార్పు ఏ మాత్రం కనిపించడం లేదు. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియో ఇలాంటి కోవకు చెందినదే.
సింహంతో ఫొటో దిగాలనుకున్న ఓ వ్యక్తి తొలుత తన కుమారుడిని సింహం వీపైకి ఎక్కించాడు. పిల్లాడు భయపడుతున్నాకూడా బలవంతంగా దానిపై కూర్చోబెట్టి ఇద్దరూ కలిసి ఫొటో దిగారు. ఆ తర్వాత తమ రెండో కుమారుడిని కూడా ఎక్కించాడు. ఇంత జరుగుతున్నా సింహం మాత్రం కాసేపు ఓపిగ్గానే ఉంది. ఆ తర్వాత ఓపిక నశించి ఒక్కసారిగా తల విసరడంతో భయంతో హడలిపోయారు. వారు కాసేపు అక్కడే ఉండి అలాగే ప్రవర్తించి ఉంటే ముగ్గురూ దానికి ఆహారంగా మారిపోయేవారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తండ్రిపై విరుచుకుపడుతున్నారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, అతడసలు మంచి తండ్రి కానేకాదని కామెంట్లు చేస్తున్నారు.