తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్‌లో 10.5 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లోని పొచ్చెరలో 11.8 డిగ్రీలు, నిర్మల్ జిల్లా కుంటల్లో 12.6 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా ర్యాలీలో 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో చలి గాలులు వీస్తున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మూడు రోజులుగా రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో చలి గాలుల తీవ్రత పెరిగింది.
ఇక ఏపీలోనూ చలి తీవ్రత పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ముంచింగిపుట్టులో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరులో 12 డిగ్రీలు, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పగటిపూట ఎండ ఉన్నప్పటికీ రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పెరుగుతున్న చలి దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే రాత్రి, తెల్లవారుజామున బయటకు వెళ్లాలని చెబుతున్నారు.