శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరదను జూరాలకు విడుదల చేస్తున్నారు. ఈ వరద మరికొన్ని రోజులు కొనసాగుతుందని, ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆల్మట్టి నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరద వదులుతున్నారు. క్రమంగా 2.25 లక్షల క్యూసెక్కులకు పెంచనున్నారు. నారాయణపూర్ నుంచి 2,02,625 క్యూసెక్కుల వరద వదులుతున్నారు. జూరాలకు 1.65 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 1,50,593 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి బుధవారం ఉదయం 1.94 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 1,75,448 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ఇది రెండు రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు కూడా దాదాపు నిండింది. ప్రాజెక్టుకు 86,663 క్యూసెక్కుల వరద వస్తుండగా, 18,746 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గురు, శుక్రవారాల్లో ప్రాజెక్టు నుంచి వరద వచ్చే అవకాశం ఉంది. గోదావరి నుంచి 10.11 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలోకి చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజీ నుంచి 7.87 లక్షల క్యూసెక్కులు, సమ్మక్కసాగర్ నుంచి 9.75 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్ ప్రాజెక్టు నుంచి 10.22 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.