సోమవారం ఉదయం గద్వాల డిపోకు చెందిన గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో సంధ్య అనే గర్భిణి ఎక్కింది. రక్షాబంధన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు సంధ్య వనపర్తికి వెళుతోంది. నాచహల్లి చేరుకున్నాక, బస్సులో సంధ్యకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి వెంటనే బస్సును ఆపింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సహాయంతో గర్భిణి పురుడు పోశారు. సంధ్య పండంటి ఆడ ‘బిడ్డ’కి జన్మనిచ్చింది.
ప్రసవం అనంతరం 108 సహాయంతో తల్లీబిడ్డలు సమీపంలోని ఆస్పత్రికి వచ్చారు.ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. కాగా, రక్షాబంధన్ రోజు బస్సులో పురుడు పోసిన కండక్టర్ భారతిని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. కండక్టర్ నర్సు సహాయంతో సమయానికి ప్రసవించడంతో తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.