కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ని నియమించింది. ఈ హైడ్రా, చెరువులను ఆక్రమించి, అక్రమ కట్టడాలను చేసిన వాటిని కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఐటీ కారిడార్ వద్ద దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు, దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని ఇళ్లకు శేరిలింగంపల్లి తహశీల్దార్ నోటీసులు జారీ చేశారు. 30 రోజుల్లోగా సమాధానం చెప్పాలని, ఆపై స్వచ్ఛందంగా కూల్చివేయాలని నిర్మాణాల యజమానులకు నోటీసుల్లో అధికారులు స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి గురువారం హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు. కాగా విషయంపై తిరుపతి రెడ్డి స్పందించారు. తాను 2015లో అమర్ సొసైటీ లో ఇంటిని కొనుగోలు చేశాను. ఆ సమయంలో తాను కొన్న ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందనే సమాచారం తెలియదని తెలిపారు. అలాగే తాను ఉంటున్న నివాసం.. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే ప్రభుత్వం, హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకున్న తనకు అభ్యంతరం లేదని సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు.