దీపావళి సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి వార్నింగ్ ఇచ్చారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేయనున్న బాణాసంచా ఉత్పత్తుల తాత్కాలిక లైసెన్స్ కోసం ఈ నెల 24న దరఖాస్తు చేసుకోవాలని బాణాసంచా డీలర్లకు సూచించారు. అనుమతి లేకుండా పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసే వారు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలి. ప్రభుత్వ స్థలంలో దుకాణం ఏర్పాటు చేస్తే జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకోవాలి. ప్రైవేట్ స్థలం యజమాని నుండి ఎన్‌ఓసితో పాటు తీసుకున్న అనుమతి లేఖ సరిగ్గా ఉండాలి. షాపు బ్లూ ప్రింట్, ఇతర రశీదులను నేరుగా సంబంధిత జోనల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఈనెల 24లోపు దరఖాస్తు చేయకుండా టపాసుల షాపులు పెడితే వారిపై కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని హెచ్చరించారు.

బాంబులు పేల్చేటప్పుడు ఇంటి ముందు బకెట్‌లో నీరు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. కాటన్ వస్త్రాలు ధరించడం ఉత్తమం అన్నారు. టపాసులను మీ చేతులతో పట్టుకుని కాల్చవద్దన్నారు. ప్రమాదవశాత్తు పేలుడు గాయం కావచ్చు, ఇంట్లో లేదా వాకిలిలో బాంబులు పేల్చవద్దన్నారు. వాటి నుంచి వెలువడుతున్న శబ్దం, పొగ వలన వినికిడి, శ్వాస సమస్యలను కలిగిస్తుందన్నారు. ఇంట్లో వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాలని, బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *