దానా తుపాను తీరం దాటింది. ఒడిశాలో తీరం దాటడంతో అక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. ఒడిశాలోని బిత్తర్‌కనిక జాతీయ పార్క్, ధమ్రా మధ్య గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రక్రియ ఈరోజు ఉదయం వరకూ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ సమయంలో ప్రచండమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దాదాపు 120 కిలమీటర్ల వేగంతో గంటకు ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపారు. అలాగే ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల చెట్లు నేలమట్టమయ్యాయి. తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, జిల్లా యంత్రాంగం బృందాలు మోహరించాయి. ముందుజాగ్రత్తగా ఒడిశాలోని 14 జిల్లాల నుంచి 10 లక్షల మందిని తరలించారు. పశ్చిమ బెంగాల్‌లో 3.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రెండు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు
.