శ్రీ సత్యసాయి జిల్లా లో బుధవారం ఓ బాలుడు పళ్లు తోముతుండగా బ్రెష్ దవడ భాగంలోకి చొచ్చుకెళ్లిన వింత ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురంలో 11 ఏళ్ల ప్రవీణ్ కుమార్ అనే బాలుడు ఉదయాన్నే లేచి రోజు మాదిరిగానే ఉదయం పళ్ళు తోముతున్నాడు. అకస్మాత్తుగా బాలుడు కిందపడటంతో బ్రష్‌లోని పదునైన భాగం దవడలోకి చొచ్చుకుపోయింది.
ఈ క్రమంలో బ్రష్ పదునైన భాగం బాలుడి దవడ భాగంలోకి అలాగే ఇరుకపోవడంతో బాలుడు విలవిలలాడిపోయాడు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సుమారు నాలుగు గంటల పాటు వైద్యులు శస్త్ర చికిత్స చేసి టూత్‌బ్రష్‌ను విజయవంతంగా తొలగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాలుడికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. బ్రెష్ చేసేటపుడు తగిన జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.