వర్షాకాలం కావడంతో ప్రాజెక్టులలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పెరిగింది. గత మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పెరగడంతో అధికారులు 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 99 వేల క్యూసెక్కులు వస్తుండగా 1,33,438 క్యూసెక్కుల నీటిని 24 గేట్లు, కుడి ఎడమ కాలువలు, పవర్ హౌస్ ద్వారా దిగువకు వదులుతున్నట్లు డ్యాం అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.250 మీటర్ల నీరు ఉందన్నారు.
భారీగా వరద వస్తుండటంతో మొత్తం 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది అని తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు వరద అలాగే కొనసాగే అవకాశం ఉందని డ్యాం అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ప్రవాహానికి అనుగుణంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని.. ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి గేట్లను ఎత్తడం, తగ్గించడం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.