తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ మేరకు భద్రాచలం సమీపంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి గోదావరికి వరద పోటెత్తింది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో 50 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఈ నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇంద్రావతి ప్రాణహిత ఉపనదుల నుంచి భారీగా వరద నీరు గోదారిలో కలుస్తున్నట్లు సమాచారం. ఎగువనున్న ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దిగువన ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఇరవై ఒక్క గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు రాత్రి 9 గంటలకు దాదాపు 11.50 లక్షల క్యూసెక్కుల వరద నమోదవుతుందని, 51.20 అడుగులకు చేరుతుందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి తగ్గుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ మంగళవారం రాత్రికి 53 అడుగులు దాటే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల సంఘం వెల్లడించింది.